పోర్టు హాస్పిటల్ ను ప్రైవేటు వారికివ్వరాదు..!

పోర్టు సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలి

సిఐటియు…

విశాఖపట్నం (అక్షర ప్రళయం)

పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని, సోంత నిధులతో అభివృద్ధి చేయాలని పోర్టు చైర్మన్ ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది . సిఐటియు పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ కుమార్ మంగళం ముక్య వక్తగా పాల్గొని మాట్లాడారు. పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ 150 పడకల సామర్థ్యంతో నిర్మించి ప్రస్తుతం 80 పడకలతో సమర్థవంతంగా పోర్టు & డాక్ అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు, రిటైర్ అయిన కార్మికులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు, పూల్ కళాశీలకు, సిహెచ్డి క్యాజువల్ కార్మికులకు మరియు సిఐఎస్ఎఫ్ ఉద్యోగులు వారి వారి కుటుంబ సభ్యులకు దశాబ్దాల తరబడి 35వేల కుటుంబాలకు సేవలందిస్తున్నది. అటువంటి మన పోర్టు హాస్పిటల్ ను పిపిపి పద్ధతిలో “మల్టీ డిసిప్లైనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్” గా 300 పడకలతో ప్రైవేటు వారికి ఇచ్చేయాలనే నిర్ణయం దుర్మార్గం. ఈ నిర్ణయాన్ని సిఐటియు నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నది. ఇదే గనుక అమలయితే పోర్టు & డాక్ కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలు(సుమారు 35 వేల మంది) ఆరోగ్య భద్రతను ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడమే అవుతుంది. ప్రైవేటు యాజమాన్యం దయాదాక్షిన్యాలపై ఆధార పడాల్సి వస్తుంది. పోర్టుల్లో పిపిపి/బిఓటి విధానాలు విఫలమయ్యాయి అని గతంలో స్వయంగా ‘కాగ్’ (కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్) మొట్టికాయలు వేసిన సంగతి విదితమే.
ప్రైవేటు వాడి చేతుల్లోకి వెళితే తిరిగి పోర్టు చేతుల్లోకి వచ్చే అవకాశం లేదు. అప్పుడు వైద్యం వేలాదిమంది పోర్టు & డాక్, పెన్షనర్ల, పూల్ మరియు కాజువల్ కుటుంబాలకు దూరమవుతుంది. మొదట్లో బ్రహ్మాండంగా ఉంటుందని భ్రమ పెడతారు. అనంతరం ఇది ఒప్పందంలో లేదు, అది ఒప్పందంలో లేదు, ధరల పెరిగాయి, ఇది వర్తించదు అది వర్తించదు, మీరు డబ్బులు చెల్లిస్తే గాని కుదరదని కరాఖండిగా చెబుతారు. మనపై అదనంగా మోయలేని భారం పడుతుంది. కరోనా మహమ్మారి కాలంలో ప్రయివేట్ ఆసుపత్రులు ఎంతలా దిగజారి ప్రజలను దోచుకున్నాయో మన కళ్ళ ముందు ఇంకా మెదలాడుతూనే ఉంది. ఇదే జరిగితే భవిష్యత్తులో మనం వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

90 ఏళ్ల విశాఖ పోర్టు చరిత్రలో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా రాత్రనకా, పగలనకా చెమటోడ్చి పోర్టును ఈ ఉన్నత స్థితికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువచ్చిన ఉద్యోగ, కార్మిక, రిటైర్ అయిన కార్మికుల కుటుంబాలకు వైద్య ఖర్చులు తగ్గించాలన్న నెపంతో ప్రైవేట్ వారికి కట్టబెడతామన్న దుర్మార్గపు ఆలోచన విరమించుకోవాలి. ఉద్యోగులు మరియు కార్మికులు పొందే వైద్యాన్ని లాభనష్టాలు బేరీజు వేయడం దుర్మార్గం. ‘మెరుగైన వైద్యం అందించడం యాజమాన్యం బాధ్యత-పొందడం ఉద్యోగ, కార్మికుల హక్కు’. పోర్టుల హాస్పిటల్స్ విషయమై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఫెడరేషన్ల అభిప్రాయాలు తీసుకునే ముందుకు వెళ్తామని గతంలో హామీ ఇచ్చిన ఐపీఎ మాట తప్పింది. పోర్టులోనున్న కార్మిక సంఘాలన్నీ ఏకపక్షంగా పోర్టు హాస్పటల్ ను ప్రైవేటీకరించొద్దని స్పష్టంగా చెప్పాయి . ఏపీ హైకోర్టు కూడా హాస్పిటల్ విషయమై కార్మిక సంఘాల అభిప్రాయాలను తీసుకోవాలని చెప్పింది. కార్మికులు, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా గోల్డెన్ జూబ్లీ హాస్పటల్ ప్రైవేటుకు ఇవ్వడానికి యాజమాన్యం మరియు ప్రభుత్వం ముందుకెళ్లడం చూస్తే ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది.

పిపిపి పద్ధతిలో ప్రైవేటు వారికివ్వరాదని, దానికి బదులుగా నిరంతరం లాభాలతో నడుస్తున్న విశాఖ పోర్టు సొంత నిధులతోనే పోర్టు ఆసుపత్రిని అత్యంత మల్టీ-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని, స్పెషలిస్ట్ డాక్టర్లను, ల్యాబ్ లను, స్పెషలైజ్డ్ స్టాఫ్ ను, నాణ్యమైన మందులను పోర్టు సొంత నిధులతోనే అభివృద్ధి చేసే చర్యలను చేపట్టాలని సిఐటియు కోరుతోంది. ఈ విషయమై పోర్టు యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం పోర్టు జి.జె ఆసుపత్రిని పి పి పి ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది.

పోర్టు ఏ.ఓ.బి వద్ద సెప్టెంబర్ 24న ఒక రోజు ధర్నా
యునైటెడ్ పోర్ట్ & డాక్ లో ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.సత్యనారయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి వి రామలింగేశ్వర రావు,వి డి ఎల్ బి & డాక్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జక్కన్న సత్యనారాయణ బి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *