మీ హయంలో ఒక్క పరిశ్రమ పూర్తి చేసినట్టు నిరూపించగలరా?
వైసీపీకి గంటా ఛాలెంజ్..!
కాపులుప్పాడ (అక్షర ప్రళయం)
సంపద సృష్టించి సంక్షేమాన్ని, అభివృద్ధిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రగతి పధం వైపు నడిపించడానికి విజన్ డాక్యుమెంట్ ను రూపకల్పన చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వివరించారు. “ఇది మంచి ప్రభుత్వం” మంగళవారం కార్యక్రమంలో భాగంగా 4 వ వార్డు కాపులుప్పాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.10 వేల కోట్ల ఆదాయంతో ఉన్న హైదారాబాద్ ను రూ.లక్ష కోట్ల ఆర్థిక నగరంగా అభివృద్ధి చేసి, 10 లక్షల మంది యువతకు ఐటీ ఉద్యోగాలు వచ్చేట్టు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని చెప్పారు. కియా అటోమొబైల్ పరిశ్రమ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడగా, మన రాష్ట్రానికి వచ్చేట్టు చేసిన ముఖ్యమంత్రి అనంతపురం రూపురేఖలు మార్చివేశారన్నారు. చంద్రబాబు తీసుకువచ్చిన లులు మాల్, అమరరాజా విస్తరణ ప్రాజెక్టు, ఫ్రాంక్లిన్ అండ్ టెంపుల్టెన్, ట్రైటన్, రిలయన్స్ వంటి పరిశ్రమలను కేవలం రాజకీయ కక్షతో వెళ్ల గొట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. అయిదేళ్ల వైసీపీ హయంలో శంకుస్థాపన చేసి, నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసిన పరిశ్రమ ఒక్కటి చూపించినా ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు. వాలంటీర్ల ప్రమేయం లేకుండా 65 లక్షల మందికి రూ.450 కోట్ల పెన్షన్లు ఒక్క రోజులో పంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెడుతుందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతీ హామీని నెరవేర్చి తీరుతామని పునరుద్ఘాటించారు. అనంతరం “పొలం పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా వరి చేలను గంటా సందర్శించారు. అధిక దిగుబడితో రైతుకు మేలు చేయాలని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వర్షాలొస్తే పొంగి పొర్లుతున్న పరదేశిపాలెం కాజ్ వేను పరిశీలించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కోరాడ రాజబాబు, కె.రామానాయుడు, డి.ఎ.ఎన్. రాజు, పి. నరసింగరావు, త్రినాధ్, గంటా నూకరాజు, బోర బంగారు రెడ్డి, శీరపు రమణ, జోనల్ కమిషనర్ పి. ప్రసన్న వాణి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.