నేడు చక్రస్నానం..
తిరుమల (అక్షర ప్రళయం)
తిరుమల కొండ వైకుంఠాన్ని తలపిస్తోంది. వైకుంఠం భువికి దిగివచ్చిందా అన్న చందంగా విద్యుత్ కాంతులతో తిరుమల కొండ భక్తులను కనువిందు చేస్తోంది.శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండను అలకంరించారు. శ్రీ మల్లప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుని అలంకారంలో తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను వీక్షించేందుకు వచ్చిన లక్షలాదిమంది భక్తులను ఆకట్టుకునేందుకు శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకమైన పార్కన్ మరియు ఫకాడ్ లైటింగ్ తో టీటీడీ అలంకరించింది. రంగురంగుల కాంతులతో శ్రీవారి ఆలయ గోడలను, మహాద్వార గోపురం, మాడ వీధులు, ముఖ్యమైన కూడళ్లు, ఆర్చిల వద్ద భక్తులు మైమరచేలా విద్యుత్ వెలుగులను శోభాయమానంగా అలంకరించారు. తిరుమలలోని ఇతర ఆలయాలు, గార్డెన్లు, చెట్లను కూడా అలంకరణలు చేశారు. పురాణాలు, ఇతిహాసాల్లోని దేవతల రూపాలతో తిరుమల కొండ మొత్తం విద్యుత్ బోర్డులు ఏర్పాటు చేయడంతో భక్తులకు వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతోంది.
చక్రస్నానం ఏర్పాట్లు…
ఈనెల 12న నిర్వహించనున్న చక్రస్నానం ఏర్పాట్లపై టీటీడీ ఈఓ శ్యామల రావు అధికారులతో కలసి గురువారం శ్రీవారి పుష్కరిణీ వద్ద తనిఖీలు నిర్వహించారు. ప్రవేశ మార్గాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది, శ్రీవారి సేవకులను సమన్వయం చేసుకుని చక్రస్నాన సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.