సుప్రీంకోర్టులో న్యాయ దేవత విగ్రహం ఏర్పాటు..
విగ్రహం ఎడమ చేతిలో రాజ్యంగం.
చట్టానికి కళ్ళున్నాయని గంతలు తొలగింపు..
న్యాయ దేవత విగ్రహంలో మార్పులు తెచ్చిన చీఫ్ జస్టిస్.
ఢిల్లీ సెంట్రల్ డెస్క్ (అక్షర ప్రళయం)
న్యాయదేవత కళ్లకు గంతలు తొలగాయ్. ఇన్నాళ్లూ భారతదేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండేవి. ఇకపై న్యాయదేవత కళ్లకు గంతలు ఉండ కూడదని దేశ అత్యున్నత ధర్మాసనమైన సుప్రీం కోర్టు నిర్ణయించింది.ఆ నిర్ణయానికి అనుగుణంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశా లతో సుప్రీం కోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అత్యున్నత ధర్మాసనంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు లేకపోవ డంతో ఈ అంశం వార్తల్లో నిలిచింది.అంతేకాదు ఇన్నాళ్లూ న్యాయ దేవత రెండు చేతుల్లో కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. సుప్రీం కోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహం ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉండటం గమనార్హం.
సుప్రీం కోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు. న్యాయం గుడ్డిది కాదని, చట్టానికి కళ్లున్నా యని బలమైన సంకేతమిచ్చే ఉద్దేశంతోనే న్యాయదేవత విగ్రహంలో సుప్రీం కోర్టు ఈ మార్పులు చేర్పులు చేసింది. అయితే ఇన్నాళ్లూ న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టడం, చేతిలో ఖడ్గం
ఉంచడం వెనక కారణం లేకపోలేదు.చట్టం ముందు అందరూ సమానమే న్యాయస్థానం డబ్బు, అధికారం.. ఇతర హోదాను చూడదు” అనే సందేశమిచ్చేందుకే న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కడతారు. ఇక చేతిలో ఉంచే ఖడ్గం విషయానికొస్తే అన్యాయాన్ని న్యాయదేవత చీల్చిచెండాడుతుందని సంకేతం ఇచ్చేందుకు ఇలా న్యాయదేవత విగ్రహం చేతిలో ఖడ్గాన్ని ఉంచారు.ఇంత గొప్ప అర్థం ఉన్నప్పుడు మరి న్యాయదేవత విగ్రహంలో మార్పులు ఎందుకు చేశారనే సందేహం కలగడం సహజం. బ్రిటీష్ ఛాయల నుంచి భారతదేశ న్యాయ వ్యవస్థ బయటపడాలనే ఉద్దేశంతో పాటు చట్టం గుడ్డిది కాదని, రెండు కళ్లు తెరిచి అందరినీ సమానంగానే చూస్తుందని చాటి చెప్పే ఉద్దేశంతో జస్టిస్ చంద్రచూడ్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించినట్టు సమాచారం.