విశాఖ లో హోటల్.. ఆతిథ్య రంగానికి పునర్వైభవం
ఎంపీ శ్రీభరత్..
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
రోజురోజుకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ సిటీగా ఎదుగుతున్న నేపథ్యంలో, హోటల్ మరియు ఆతిథ్య రంగానికి మరింత ప్రాముఖ్యతను ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోటల్ ఇండస్ట్రీకి ఇచ్చిన హామీ మేరకు, రాత్రి 12 గంటల వరకు హోటళ్లు మరియు రెస్టారెంట్లను నడిపే అవకాశం కల్పించడం ద్వారా ఈ రంగానికి మద్దతు ఇవ్వడమే కాకుండా, గతంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తోంది.
ఈ సందర్భంగా విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, “ఈ నిర్ణయం విశాఖపట్నం హోటల్ మరియు అతిథ్య రంగానికి మరింత వైభవం తీసుకురావడమే కాకుండా, రానున్న రోజుల్లో ఐటీ మరియు పర్యాటక రంగాల అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుంది. విశాఖపట్నాన్ని పర్యాటక, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా మరిన్ని విధానాలను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో అడుగులు వేస్తోంది” అని తెలిపారు.
ఈ నిర్ణయం విశాఖలోని పర్యాటక ప్రోత్సాహకులకు, వ్యాపారానికి, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలం చేకూరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.