జెవి రత్నం…
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
పర్యావరణ హితంగా దివ్వెల పండుగ నిర్వహిద్దాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం శివాజీ పాలెం జివిఎంసి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎకో వైజాగ్ ను విజయవంతం చేద్దామని అన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలన్నారు. పశు, పక్ష్యాదులకూ, వృద్ధులకూ, పిల్లలకూ హాని కలగకుండా సాంప్రదాయ బద్దంగా దివ్వెల పండుగ నిర్వహిస్తామన్నారు. ఒకే రోజు లక్షలాదిమంది బాణాసంచా కాల్చితే కలిగే నష్టాలు వర్ణనాతీతం అన్నారు.ఉపాధ్యాయని డాక్టర్ మురహరరావు ఉమా గాందీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ప్రతీ విద్యార్థి తమ కుటుంబం లోని అందరికీ అవగాహన కల్పించాలన్నారు. బాణాసంచా మోతలతో నగరానికి నష్టం కలుగుతుందని ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని కోరారు. ప్రతీ మనిషి తమకు ఏడాది పొడవునా అవసరమైన ప్రాణవాయువు కోసం మొక్కలు నాటి పెంచాలి అని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థినులు బి ఉషారాణి, బి తేజస్విని, ఆడమ్, బి చైతన్య సరస్వతి తదితరులు పాల్గొని మాట్లాడారు.