కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
సీఎం రమేష్ ను ఘనంగా సన్మానించిన విశాఖ ప్రముఖులు
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ను శనివారం రాత్రి గ్రాండ్ బే హోటల్ లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మిత్రబృందం ఘనంగా సన్మానించింది. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఎన్నిక కావడం ఉత్తరాంధ్రకు గర్వ కారణమని తెలిపారు. భవిష్యత్ లో ఉత్తరాంధ్రను ఉన్నతమైన ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కలిసికట్టుగా పని చేద్దామని చెప్పారు. అసాధ్యమైన విషయమనేది ఏదీ లేదని నిరూపించిన నాయకుడిగా రమేష్ ను అభివర్ణించారు. 12 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా చేసి లోక్ సభకు పోటీ చేసి 3 లక్షల మెజారిటీ తెచ్చుకున్న దమ్మున్న నాయకుడని పేర్కొన్నారు.భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులు తీసుకురావాలని సీఎం రమేష్ ను కోరారు. కేంద్రం స్థాయిలో ట్రబుల్ షూటర్ గా పేరు ప్రఖ్యాతులు పొందారని చెప్పారు. తాను కడప జిల్లా ఇంచార్జీ మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిపై టీడీపీని పోటీకి పెట్టి గెలిపించిన క్రెడిట్ రమేష్ కు దక్కుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూన రవి కుమార్, సుందరపు విజయ్ కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్, కె.ఎస్.ఎన్.రాజు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి రావు, దువ్వారపు రామారావు, బత్తుల తాతయ్య బాబు, పీలా గోవింద సత్యన్నారాయణ, గంటా రవితేజ, కంకటాల మల్లికార్జునరావు, జాస్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.