ఎయు కు వస్తే తన స్వంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది
వెస్ట్ సబ్ డివిజన్ ఏ.సి.పి డాక్టర్ అన్నెపు నరసింహమూర్తి
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
తల్లిదండ్రులు జన్మనిస్తే చదువుల తల్లి ఆంధ్రా విశ్వవిద్యాలయం జీవితాన్నిచ్చిందని విశాఖపట్నం వెస్ట్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలిస్ డాక్టర్ అన్నెపు నరసింహమూర్తి ఉద్విగ్నంగా పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆంధ్రా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన బియాండ్ ది బ్యాడ్జ్ పబ్లిక్ సేఫ్టీ లీడర్ షిప్ అండ్ లైఫ్ ఇన్ యూనిఫామ్ కార్యక్రమంలో పాల్గొని తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశం గర్వించే మహోన్నతులను తయారు చేసిన చదువులతల్లి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య నభ్యసించి జీవితంలో పైకి ఎదగడం ఒక మధురానుభూతి అని అన్నారు. విద్యార్థుల సంధించిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ అత్యంత వెనుక బడిన ప్రాతం నుంచి వచ్చిన తాను ఎయు వేదికగా ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ ను కూడా అందుకున్నా నన్నారు. అందుకే ఎయుకు వస్తే తన స్వంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న పోలీస్ అధికారి విధి నిర్వహణలో అన్ని వైపుల నుంచి పలు రకాల ఒత్తిడిలు ఉంటాయని, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలకు చేరువగా మంచి సేవలు చేయడంలోనే ఆత్మ సంతృప్తి ఉంటుందన్నారు. సమాజంలోని ప్రజలంతా యూనిఫామ్ లేని పోలీసులేనని, వారు క్రమశిక్షణతో మెలుగుతూ విధినిర్వహణలో ఉన్న పోలీసులకు బాగా సహకరిస్తే సమాజంలో శాంతి భద్రతలు పరిఢవిల్లు తాయన్నారు. అభివృద్ధి జరగాలన్నా, ప్రజలు సుఖ శాంతులతో జీవించాలన్నా లా అండ్ ఆర్డర్ చాలా కీలక మన్నారు. దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ మసలు కోవాలన్నారు. విశాఖ నగరంలో యువత సోషల్ మీడియా వలలోనూ, మత్తు పదార్థాల జోలికి వెళ్ళకుండా బాగా చదువుకుని తల్లి దండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. జీవితంలో పైకి ఎదగడానికి పబ్లిక్ రిలేషన్స్ కూడా ముఖ్యమే నన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎయు పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు.