భక్తుల సౌకర్యార్థం తగిన భద్రతాపరమైన చర్యలు తీసుకున్నాం…
జిల్లా వ్యాప్తంగా 400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు..
పోలీస్ శాఖ హెచ్చరికలు, సూచనలు భక్తులు తప్పనిసరిగా పాటించాలి..
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్..
బాపట్ల (అక్షర ప్రళయం)
నవంబర్ 15 కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం తగిన భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ తెలిపారు. స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాలు జిల్లాల నుండి సూర్యలంక, రామాపురం, ఓడరేవు, నిజాంపట్నం ఇతర సముద్ర తీరా, కృష్ణానది తీరా ప్రాంతాలలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 400 మంది పోలీసులతో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పుణ్య స్నానాలు ఆచరించడానికి విచ్చేసే భక్తులకు అర్థమయ్య విధంగా సూచిక బోర్డులను ఏర్పాటుచేశామన్నారు. భక్తులు పుణ్య స్థానాలు ఆచరించే సమయాలలో ఎక్కువ లోతులోకి వెళ్ళి ప్రమాదాలకు గురికాకుండా నిర్దిష్ట లోతును గుర్తించి అక్కడ జెండాలను ఏర్పాటు చేసి, స్థానిక జాలర్ల సాహయంతో పోలీస్ అధికారులు సిబ్బందితో పడవలలో గస్తీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తీరం వెంబడి లైఫ్ జాకెట్లు, రోప్ లను ధరించిన పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు.
పుణ్య స్నానాలను ఆచరించడానికి విచ్చేసే భక్తులు, యువకులు పోలీసువారి హెచ్చరికలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలీసులు సూచించే సూచనలు, హెచ్చరికలు ప్రజల రక్షణ, భద్రత కొరకే అని గ్రహించాలన్నారు. భక్తులు వారితోపాటు వారి పిల్లలను పుణ్యస్నానాలు ఆచరించడానికి తీసుకుని వచ్చినప్పుడు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతంలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. సముద్రపు అలల యొక్క ఆటుపోట్లను గమనిస్తూ సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్లకుండా పోలీస్ వారు సూచించిన లోతు వరకే వెళ్లి స్నానాలు అచరించాలన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి ఏర్పడినందునా పుణ్య స్నానాలు ఆచరించడానికి విచ్చేసే భక్తులు సముద్రపు ఆటుపోట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ పోలీసు వారి సూచనలు పాటిస్తూ, ఆనందంగా, ఆహ్లాదకరంగా పుణ్య స్నానాలు ఆచరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.