పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
ఆలయం వద్ద ప్రతి రోజూ అన్నదానం, డిసెంబర్ 26న మహాన్నదానం ఆలయ ఈవో..
విశాఖపట్టణం (అక్షర ప్రళయం)
డిసెంబర్ 02 నుంచి 30వ తేదీ వరకు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పరిధిలో జరగనున్న మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పలు అంశాలపై ఆయన మార్గదర్శకాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపట్టాలని, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. చైన్ స్నాచింగ్ లు, ఇతర దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రతి గురువారం ఏవీఎన్ కళాశాల దిగువ నుంచి వాహనాలు దారి మళ్లించుట, శుక్ర, శనివారాల్లో టౌన్ కొత్త రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు వరకు ట్రాఫిక్ మళ్లించాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా సరిపడా క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ఎక్కడికక్కడ డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పోలీసు శాఖ సూచనల మేరకు అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆలయ అధికారులను ఆదేశించారు. నిత్యన్నదానం, ప్రసాదం కౌంటర్, క్యూలైన్ల వద్ద సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడికక్కడ సూచిక బోర్డులు, వికలాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని విభాగాల అధికారులతో ఆలయ సమీపంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న దుకాణాలను వెనక్కి జరపాలని, ట్రాఫిక్ అంతరాయం, భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సేవా సంఘాలు, ఎన్.ఎస్.ఎస్., ఎన్.సి.సి. వాలంటీర్లను వినియోగించుకోవాలని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి రోజూ అన్నదానం, డిసెంబర్ 26న మహాన్నదానం..
భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజూ ఉదయం 11.00 గంటల నుంచి జగన్నాధ స్వామి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ ఉంటుందని, అలాగే డిసెంబర్ 26వ తేదీన సున్నపువీధి దిగువ నుంచి కొత్తరోడ్డు వరకు గల రోడ్డులో మహాన్నదానం ఏర్పాటు చేస్తున్నామని ఉప కమిషనర్, ఆలయ ఈవో కె. శోభారాణి తెలిపారు. ఉచిత, సర్వ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తూ వీఐపీ పాసులను పరిమితం చేశామని, దర్శన వేళలను కూడా కుదించామని చెప్పారు. ఉదయం 6.00 నుంచి 8.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 గంటల వరకు వీఐపీ దర్శనాలు ఉంటాయని వివరించారు. విశిష్ట దర్శనం రూ.500, రూ.200, ప్రత్యేక దర్శనం రూ.100గా కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మార్గశిర మాసోత్సవాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్బంగా ఆమె విజ్ఞప్తి చేశారు.
దర్శన వేళలు అభిషేకాలు
మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా నాలుగు గురువారాలు డిసెంబర్ 05, 12, 19, 26వ తేదీల్లో వస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ఈ దినాల్లో బుధవారం తెల్లవారు ఝాము నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో ఉదయం 6.00 నుంచి 11.30, మధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 5.30 వరకు, రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వదర్శనం ఉంటుందని చెప్పారు. భక్తులు ఈ వేళల్లో అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. త్రికాల సమయాల్లో అభిషేకాలు జరుగుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఉప కమిషనర్, ఆలయ ఈవో కె. శోభారాణి, సహాయక ఈవో టి. అన్నపూర్ణ, కార్యనిర్వహక అధికారి సి.హెచ్.వి. రమణ, సహాయక ఈవో తిరుమలేశ్వరరావు, అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.