కారు టైరు పేలి బోల్తా కొట్టడంతో ఢీ కొట్టిన లారీ
విశాఖలో బ్యాంకు ఎగ్జామ్ రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం
మృతుల్లో ఇద్దరు భార్యాభర్తలు
మృతులంతా శ్రీకాకుళం టౌన్ కు చెందినవారే
భోగాపురం (అక్షర ప్రళయం)
భోగాపురం జాతీయ రహదారిపై పోలిపల్లి వద్ద కారు బోల్తా పడిన సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా శ్రీకాకుళం టౌన్ కి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తుండగా పోలిపల్లి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద కారు అదుపు తప్పింది. అదుపుతప్పిన కారు విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే రహదారి పైకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా డీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళతో పాటు నలుగురు అక్కడకక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. పోలీసుల అందించిన వివరాలు ప్రకారం శ్రీకాకుళం టౌన్ కి చెందిన గవిడి కౌశిక్, వడ్డే అభినవ్, వడ్డే మణిమాల, డ్రైవర్ జేయస్ మృతి చెందారు. ఇందులో వడ్డే అభినవ్ , మణిమాల భార్యాభర్తలు కాగా కౌశిక్, అభినవ్ స్నేహితులు. విశాఖపట్నం లో జరిగే ఐబీపీఎస్ బ్యాంక్ మెయిన్ ఎగ్జామ్ కోసం స్నేహితుడు కౌశిక్ కారులో బయలుదేరారు. ఇంతలో పోలిపల్లి వద్దకు వచ్చేసరికి టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కౌశిక్ బంగారం షాపు నిర్వహిస్తుండగా, అభినవ్ ల్యాబ్ ను శ్రీకాకుళం పట్టణంలో నిర్వహిస్తున్నారు. మృతి చెందిన భార్యాభర్తలకు కుమారుడు ఉండగా కౌశిక్ కు వివాహం జరిగింది. సిఐ ప్రభాకర్, ఎస్సైలు పాపారావు, సూర్య కుమారి సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.