సి.ఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించిన తర్వాత నిర్ణయం..!
మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించిన కూటమి నేతలు..!
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
విశాఖ ఉక్కుకు పూర్వవైభవం తీసుకువస్తామని విశాఖ ప్రాంత కూటమి నేతలు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఆదేశాల ప్రకారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విశాఖ ప్రాంత కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు రాడిసన్ బ్లూ రిసార్ట్ లో సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై విస్తృతంగా చర్చించారు. అందరూ తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విశాఖ ప్రాంతంపై తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. పాదయాత్ర సమయంలోనూ విశాఖ స్టీల్ కు శాశ్వత పరిష్కార చూపుతామని హామీ ఇచ్చామన్నారు. విశాఖ ఉక్కు తో ప్రతి తెలుగు వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లో తమ ఇంటి నిర్మాణ సమయంలోనూ విశాఖ స్టీల్ వినియోగించిన విషయాన్ని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి కార్మికుల కళ్ళలో ఆనందం చూడాలనే దృఢ సంకల్పంతో కేంద్రంలోని పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నానని లోకేష్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై అందరి సలహాలు, సూచనలు స్వీకరించారు. విశాఖ ఉక్కుకు పూర్వవైభవం తీసుకువస్తామని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఈ సందర్భంగా కూటమి నేతలు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. సమావేశం వివరాలను చంద్రబాబునాయుడు తో చర్చించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత స్టీల్ ప్లాంట్ అంశంపై చంద్రబాబు నిర్ణయం వెల్లడిస్తారన్నారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం కాని సమస్యే ఉండదు. అటువంటి సంప్రదాయం విశాఖ ఉక్కు తో మళ్ళీ ప్రారంభించాం. రానున్న రోజుల్లో ఇతర సమస్యల పరిష్కారం కోసం కూడా అందరూ కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశంలో
నిర్ణయం తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇదే సంప్రదాయం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చంద్రబాబునాయుడు సూచించారని, ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని లోకేష్ తెలిపారు.