అశోక్ గజపతిరాజు, మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు
విజయనగరం: (అక్షర ప్రళయం)
దొంగలు నీతులు చెప్తుంటే వినడానికి కష్టంగా ఉందని కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు. జగన్ ఇంట్లో ఒక మతం, బయట మరోమతం, ఈ తమాషాలు ఏంటో అర్థం కావడం లేదని విమర్శించారు. హిందూ మత ఆచారాలు, ధర్మాన్ని పాటించని జగన్ వాటితో ఆడుకోవడం మంచిది కాదని అశోక్ గజపతిరాజు హెచ్చరించారు. హిందూధర్మాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తిరుమల కల్తీ నెయ్యి విషయంలో తప్పు చేసిన వారు మాజీ ముఖ్యమంత్రి అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా శిక్ష పడాల్సిందేనని చెప్పారు. గత ప్రభుత్వం నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రసాదాల్లో నాణ్యత లోపించిందన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్ ఆపమని చెప్పలేదని అశోక్ గజపతిరాజు వివరించారు. ఆలయాలకు కమిటీల నియామకం, ఇతర సాంప్రదాయాల విషయాల్లో జగన్ గతంలో ఆధ్యాత్మికవేత్తలు సలహాలు తీసుకుని ఉంటే సమస్యలు వచ్చేవి కావన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 200 ఆలయాలకు పైగా దాడులు జరిగాయి, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అశోక్ గజపతిరాజు గుర్తు చేశారు.