పోలీసు కమీషనర్ కు వైసిపి కార్పొరేటర్ల వినతి
విశాఖపట్టణం (అక్షర ప్రళయం)
విశాఖ నగరంలో విశేష సేవాకార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజల మన్ననలు పొంది కౌన్సిల్ వేదికగా ఎల్లప్పుడూ ప్రజాపక్షంగా వ్యవహరించే కార్పొరేటర్ డాక్టర్ పివి సురేష్ పై రాజకీయ కక్షలతో ఇబ్బందులకు గురిచేయాలనే దురుద్దేశంతో నమోదు చేసిన అక్రమ రౌడీషీట్ ను వెంటనే తొలగించాలని విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కోరారు. ఈ మేరకు సోమవారం నగర పోలీసు కమీషనర్ కార్యాలయంలో కమీషనర్ శంకబ్రత బాగ్చీని డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ సారథ్యంలో కలిసి నగర్ మేయర్ హరివెంటక కుమారి తరపున వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవకు పరితపిస్తూ అధికారపక్షంలో ఉన్నా కూడా ఎల్లపుడూ ప్రజాపక్షాన నిలిచే సేవకుడిగా, కౌన్సిల్ లో ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా కూడా తీసుకోకుండా పనిచేస్తున్న నిస్వార్థ నాయకుడిగా పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా విశాఖ నగర వ్యాప్తిగా విశేష కీర్తిని తన సొంతం చేసుకున్న డాక్టర్ పివి సురేష్ పై కూటమి నేత కక్షసాధింపుకు ఫలితంగా చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని అక్రమంగా రౌడీషీట్ నమోదు చేయడం దారుణమని అన్నారు. యువకులు రాజకీయాలలోకి రావాలంటూ ఊకదంపుడు ప్రసంగాల నడుమ తమ వారసులను ప్రజలకు పరిచయం చేసే నాయకులు నిస్వార్థంగా ప్రజలకు సేవచేస్తూ పార్టీలకు అతీతంగా అందరు నాయకులచేత శభాష్ అనిపించుకుంటున్న సురేష్ ను అనగదొక్కాలని ప్రయత్నం చేయటం అన్యాయం అని అన్నారు. అధికార దుర్వినియోగం చేస్తూ సాక్షాతూ ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉన్న ఒక సిఐ కూటమి నాయకుడిపై ఉన్న స్వామిభక్తిని ప్రదర్శిస్తూ ఒక్కకేసు ఉన్నా రౌడీషీట్ తెరుస్తామని నిస్సిగ్గుగా చెప్పటం కూటమి ప్రభుత్వంలో అధికారుల పనితీరుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ఆస్థిని కాపాడటమే లక్ష్యంగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిన కార్పొరేటర్ పివి సురేష్ పై రాజకీయ కుట్రతో అక్రమ కేసులు బనాయించి వాటి ఆధారంగా రౌడీషీట్ ను నమోదు చేసి వేధించటం సమాజానికి తప్పుడు సంకేతాలను ఇవ్వడంతో పాటుగా నిస్వార్థ సేవాతత్పరతకు గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేని పొలిటికల్ రౌడీ షీట్ల సంస్కృతిని పెంచిపోషించే విధానాన్ని కూటమి నేత విడనాడాలని హితవు పలికారు. డాక్టర్ పివి సురేష్ పై నమోదు చేసిన అన్ని కేసులు రాజకీయ కక్షపూరిత నేపథ్యంలోనే నమోదు చేశారని, ఆయనపై రౌడీషీట్ ను ఎత్తివేయాలని సాక్షాత్తు నగర మేయర్ ఇచ్చిన వినతిపత్రాన్ని కమీషనర్ కు అందించగా ఈ విషయంపై తనకు సమాచారం లేదని ఇది స్థానిక ఎసిపి లేదా సిఐల స్థాయిలో అంశమే అని తాను కూడా ఒకసారి ఈ అంశాన్ని పరిశీలిస్తానని పోలీసు కమీషనర్ హామీ ఇచ్చినట్లు వారంతా తెలిపారు. కమీషనర్ ను కలిసినవారిలో జివిఎంసి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, కార్పొరేటర్లు కెవిఆర్ స్వాతి, మొల్లి లక్ష్మి, కె అనిల్ కుమార్ రాజు, నక్కిళ్ళ లక్ష్మి, అక్కరమాని పద్మ, కొణతాల సుధ, గులిగిందల లావణ్య, గుడివాడ అనూష, ఎ రోహిణి, ముర్రు వాణి, ఉరుకూటి రామచంద్రరావు, చెన్నా జానకీరామ్, తిప్పల వంశీరెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్, బల్లా లక్ష్మణరావు, గుండపు నాగేశ్వరరావు, రెయ్యి వెంకటరమణ తదితరులు ఉన్నారు.