2023 ఏడాదికి గాను సౌత్ జోన్ విజేతగా ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ నీటి అవార్డుకు ఎంపిక
భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
విశాఖపట్టణం (అక్షర ప్రళయం)
జల వనరుల నిర్వహణ, సంరక్షణలో 2023 ఏడాదికి గాను ఉత్తమ జిల్లా కేటగిరీలో సౌత్ జోన్ విజేతగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్టణం జిల్లా ఎంపికయ్యింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ, నది అభివృద్ధి – గంగా పునరుజ్జీవనం నీటి వనరుల సంరక్షణ, నిర్వహణ రంగంలోని వివిధ విభాగాలకు 5వ జాతీయ నీటి అవార్డులు -2023 విజేతలను ప్రకటించగా ఉత్తమ జిల్లా విభాగంలో సౌత్ జోన్ విజేతగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం జిల్లా నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగంలో మూడో ర్యాంకు జాయింట్ విన్నర్ గా అనంతపురం జిల్లా నుంచి హంపాపురం స్థానం దక్కించుకుంది.
ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, సహాయ మంత్రులు వి. సోమన్న, రాజ్ భూషన్ చౌదరి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు విశాఖపట్టణం జిల్లా కలెక్టర్‌ను అభినందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు.