నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ
గాజువాక (అక్షర ప్రళయం)
రక్తదాతలు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే ప్రాణదాతలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. రక్తదానంపై యువత అవగాహన పెంచుకుని ముందుకు రావాలని హితవుపలికారు. గాజువాక పట్టణంలో గొడబ మనోజ్ కుమార్, లావణ్య దంపతుల కుమార్తె ప్రేరణ రెండవ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా బాధిత చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూ, తలసేమియా వ్యాధి ప్రాణాంతకమైనదని, అయితే అమెరికా వంటి దేశాలలో జినోమ్ పద్ధతి ద్వారా చికిత్స అందు బాటులోకి వచ్చిందని అన్నారు. ఈ చికిత్సా విధానం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. తాను పోలీస్ అధికారిగా కాకుండా వైద్యునిగా కూడా కొన్ని సూచనలు చేస్తున్నానంటూ తలసేమియా వ్యాధి గ్రస్తుల కుటుంబ సభ్యులకు విలువైన సలహాలు అందించారు. జిల్లాలో ఎంతమంది బాధితులు ఉన్నారో గుర్తించి వివరాలు సేకరిస్తే వారికి వైద్య సహాయం అందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులకు సూచించారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. మరో ముఖ్యఅతిథి తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జన్మదిన వేడుకను పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా వినూత్నంగా నిర్వహించిన నిర్వాహకులు అభినందనీయులన్నారు. తలసేమియా బాధితుల పరిస్థితి దయనీయమని, వారికి ప్రభుత్వ పరంగా వైద్య సహాయం అందుతుందని అన్నారు. మరింత మెరుగైన, ఆధునిక వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిర్వాహకులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా తలసేమియా బాధితుల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని తమ కుమార్తె జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేశామన్నారు. రక్తదానం చేసినవారికి సర్టిఫికేట్ తో పాటు రెండు లక్షల ఇన్స్యూరెన్స్ కూడా చేయిస్తుమన్నారు.తమ విన్నపాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరై స్ఫూర్తిని నింపిన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ గారికి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు గొడబ రాంబాబు, ధవళేశ్వరపు రవికుమార్ మాట్లాడుతూ, ఇకపై రక్తదాన శిబిరాలు వంటి సామాజిక కార్యక్రమాల్లోనూ తాము భాగస్వాములం అవుతామన్నారు. ఈకార్యక్రమంలో ఏసీపీ త్రినాథ్ , సీఐ పార్థసారధి , సీనియర్ న్యాయవాదులు వెన్నల ఈశ్వరరావు, రాంబాబు, వైసీపీ నాయకులు దేవన్ రెడ్డి, కార్పొరేటర్ ఉరుకూటి చందు, స్థానిక టిడిపి నాయకులు మహ్మద్ రఫీ, గోమాడ వాసు, గొడబ దుర్గా ప్రసాద్, సునీత,కౌశిక్, పూరిమహంతి గణేష్, ప్రియ,ఛత్రపతి శివాజీ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు సర్ధార్ వినయ్, సాయి గణేష్ , పి.నవీన్ సిబ్బంది పాల్గొన్నారు.