దిల్లీ (అక్షర ప్రళయం)
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష అంశం పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది..
అతడి పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృష్టికి తీసుకెళ్లాలని ఆమె కార్యదర్శిని ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లోగా నిర్ణయం తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం రాష్ట్రపతిని అభ్యర్థించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది.సిక్కులకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా 1995లో చండీగఢ్ సచివాలయం ముందు జరిగిన పేలుడులో అప్పటి మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ తో పాటు మరో 16 మంది మరణించారు. ఈ పేలుడులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బల్వంత్ సింగ్ రాజోనా ప్రమేయం ఉన్నట్లు రుజువు కావడంతో 2007లో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. గత రెండు దశాబ్దాలకు పైగా రాజోనా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ 2012లో రాజోనా (బల్వంత్ సింగ్ రాజోనా) కేంద్రాన్ని ఆశ్రయించాడు. అప్పటినుంచి అతడి పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది. ఈ క్రమంలోనే తన మరణశిక్షను జీవితఖైదుకు తగ్గించాలని కోరుతూ 2020లో రాజోనా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. మరణశిక్షను జీవితఖైదుగా మార్చలేమని గతేడాది మే నెలలో తేల్చిచెప్పింది. అయితే, అతడి క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది.