భీమిలి ఎమ్మెల్యే గంటాకు మత్స్యకారుల వినతి
భీమిలి (అక్షర ప్రళయం)
మత్స్యకారులకు కష్టపడి పనిచేయడం తెలుసని, నీతి నిజాయితీగా గంగమ్మ తల్లినే నమ్ముకొని జీవించే గంగపుత్రుల మనోభావాలను అర్ధం చేసుకొని సహకరించాలని గ్రామాభివృద్ధి సేవాసంఘం అధ్యక్షులు, మత్స్యకారుల నాయకుడు గంటా నూకరాజు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి విజ్ఞప్తి చేసారు. ఆదివారం భీమిలి ప్రెస్ క్లబ్ లో మత్స్యకార పెద్దలు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖ జిల్లా మత్స్యకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గత పదిరోజులుగా భీమిలి జోనల్ కార్యాలయం వద్ద మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవదిక నిరసన కార్యక్రమాన్ని గంటా హామీతో విరమించామని గంటా నూకరాజు తెలియజేసారు. వారంరోజుల్లోగా అధికారులతో చర్చించి వివరాలు సేకరించి మత్స్యకారులకు న్యాయం జరిగేవిధంగా చేస్తామని అన్నారని చెప్పారు. మత్స్యకారులంటే నాకు ఎంతో అభిమానమని అన్నారు.భీమిలి నుండి రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశానని ప్రతీసారి మత్స్యకారుల గ్రామం అయిన అన్నవరం నుండే ప్రచారం మొదలు పెట్టానని చెప్పినట్లు తెలియజేసారు. తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారని అన్నారు. అదేవిదంగా ఈ పదిరోజులు కూడా కలసివచ్చిన మా సహచర మత్స్యకారుల కుటుంబ సభ్యులు అయినటువంటి బోయవీధి, ఎగువపేట, తోటవీధి, చిన నాగమయ్య పాలెం, పెద నాగమయ్య పాలెం, అన్నవరం, ఉప్పాడ, మంగమారిపేట, తిమ్మాపురం, ఋషికొండ గ్రామ పెద్దలకు, సంఘసభ్యులకు కృతజ్ఞతలు అని గంటా నూకరాజు తెలియజేసారు.పత్రికా సమావేశంలో మాట్లాడిన వారిలో గ్రామాభివృద్ధి సేవాసంఘo కార్యదర్శి వాసుపల్లి కొండబాబు, పెద్దలు వాసుపల్లి గరగయ్య, కారి చిన్నారావు, పుక్కళ్ళ ఎల్లారావు, నక్కా రవి, దూడ రాజు, గంటా ఎల్లాజీరావు, పుక్కళ్ల అమ్మోరు తదితరులు ఉన్నారు.